Telangana Home Guards: ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హోంగార్డుల పక్షాన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణకీ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా తెలంగాణ స్థానికతకు చెందిన హోంగార్డులు ఆంధ్రప్రదేశ్‌లో విధులు, అదే విధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ హోంగార్డులు పని చేస్తున్నారన్నారు. తెలంగాణ స్థానికతకు చెందిన హోంగార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెలక్ట్ అయ్యారని తెలిపారు. రాష్ట్ర విభజన జూన్, 2014 తరువాత వారంతా ఆంధ్రప్రదేశ్‌లో ఉండిపోయారని, అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగినా, హోంగార్డులను మార్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణకు చెందిన హోంగార్డులు పనిచేస్తున్నారని, ఆ కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయన్నారు.
దీనివలన వారు ఉద్యోగం ఆంధ్రప్రదేశ్‌లో, కుటుంబం తెలంగాణలో ఉండటంవలన, మానసికంగా, కుటంబపరంగా, డ్యూటీకి హాజరుకావడానికి, రవాణాపరంగా, ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. హోంగార్డుల తల్లితండ్రులు వృద్ధాప్యంలో ఉండంటం వలన, వారి బాగోగులు చూసుకోలేకపోతున్నారన్నారు. కొంతమంది పిల్లలు ఆంధ్రప్రదేశ్‌లో విద్యను కొనసాగిస్తున్నారని వారు భవిష్యత్తులో తెలంగాణ స్థానికతను కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన జూన్ 2014 నుంచి దాదాపుగా 11 సంవత్సరాలుగా స్వరాష్ట్రాలకు వెళ్ళాలని ఎదురుచూస్తున్నా, వారి సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలం చెందారని వాపోయారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌కు హోంగార్డ్స్ బదిలీ చేయడానికి అభ్యంతరం లేదని తెలిపినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ స్పందించటం లేదన్నారు. తెలంగాణ హోంగార్డులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజేష్, నగేష్, మురళి, విజేందర్, సురేందర్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.