BJP leader Ravula Ramnath: నిర్మల్, ఆగస్టు 12 (మన బలగం): మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టైంపాస్ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో తన ఉనికి కాపాడుకోవడానికి మతిభ్రమించి మాట్లాడటం సరికాదని బీజేపీ నాయకులు రావుల రాంనాథ్ మండిపడ్డారు. గతంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేసిన మీరు ఒక లోతట్టు ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి, గత ఏడాది వర్షాలకు ఒక అంతస్తు వరకు పూర్తిగా ఆ ఇండ్లు మునిగి పోయిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు అధికార పార్టీలో మీ అరాచకాలకు అడ్డూ అదుపు లేదన్నారు. నేడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి బురద జల్లే చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లోగా ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేపట్టకపోతే 10 వేల మందితో బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు. దమ్ముంటే ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ధర్నా చేసి ఇండ్ల పంపిణీకి అనుమతి తీసుకురావాలని సవాల్ చేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఉనికి లేదని, ఉనికి కాపాడుకోవడానికి రెండు, మూడు నెలలకు ఒకసారి నిర్మల్‌లో తప్పుడు ప్రచారాలతో చేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, వెంటనే ఇలాంటి పనులు మానుకోవాలని సూచించారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హయాంలో పక్కనే జీఎన్ఆర్ కాలనీ అక్రమ లే ఔట్‌కు అనుమతులు ఇచ్చి అమాయక ప్రజల ఉసురు పోసుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, నాయకులు తక్కల రమణ రెడ్డి, ముత్యం రెడ్డి, ఒడిసెల అర్జున్, తాజా మాజీ కౌన్సిలర్లు సాదం అరవింద్, నరేందర్, నవీన్, పద్మాకర్, పోడెల్లి గణేష్, నాయకులు గంజి రాజు, జుట్టు దినేష్, జింక సూరి, రవి, నిర్మల్ రూరల్ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నర్సారెడ్డి, గణేష్ గౌడ్, ఈర్ల విజయ్ పాల్గొన్నారు.