- వారం రోజులుగా ఒక బస్తా కోసం యుద్ధమే చేస్తున్న అన్నదాత
- ఎవరికి ‘చెప్పు’కుంటే సమస్య తీరుతుంది
Farmers struggle for urea supply in Nirmal district: రైతులకు యూరియా కష్టాలు తప్పటం లేదు వారం రోజుల నుంచి, మునుపెన్నడూ లేని విధంగా యూరియా కోసం పీఏసీఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక బస్తా అయిన ఇవ్వండి అని అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఎవరికి ‘చెప్పు’కుంటే సమస్య తీరుతుందని అంటున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో రైతుల దారుణ పరిస్థితి ఇది.. కడెం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద గురువారం వర్షంలో తడుస్తూ, మళ్ళీ చెప్పులను లైన్‌లో పెట్టి బారులు తీరారు. వారం రోజులుగా ఈ పీఏసీఎస్ కేంద్రం వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. మొన్న యూరియా కోసం రైతులు అందరు కలిసి రోడ్డు పైన ధర్నా చేశారు. అయిన పరిస్థితిలో మార్పు రాలేదు. వర్షాన్ని సైతం కూడా లెక్కచేయకుండా వరుస క్రమంలో చెప్పులను పెట్టి గొడుగు పట్టుకొని నిలబడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడెం మండలంలో యూరియా డిమాండ్ ఎంత అవసరం ఉంటుందో అధికారులకు తెలిసిన నిర్లక్ష్యం వ్యవహరించటం వల్లనే ఈ కొరత ఏర్పడిందని వాపోయారు. రైతులకు అవసరం ఉన్నంత యూరియాను ఎందుకు అందించడం లేదంటూ మండిపడుతున్నారు. యూరియా కోసం ఇలా ఎన్ని రోజులు నిరీక్షించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతధికారులు స్పందించి రైతులకు సరిపడే యూరియాను అందించాలని కోరుతున్నారు.

