ప్రభుత్వానికి తుడుం దెబ్బ డిమాండ్
Demand for state holiday on Komaram Bheem Jayanti and Vardhanti: ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు కొమరం భీమ్ జయంతి, వర్ధంతి రోజులను రాష్ట్రవ్యాప్తంగా తప్పనిసరిగా సెలవు దినాలుగా ప్రకటించాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా, తుడుం దెబ్బ జిల్లా కమిటీ నాయకులు నిర్మల్ పట్టణంలోని కొమురం భీం విగ్రహాలకు, డీటీడీవో కార్యాలయంలోని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకగారి భూమయ్య, కొమరం భీమ్ పోరాటం ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో నిజాం పాలకులకు వ్యతిరేకంగా సాగిందని గుర్తు చేశారు. ఆయన పోరాటం అణగారిన వర్గాల స్వయంపాలన, స్వాభిమానం కోసం సాగిన చరిత్రాత్మక ఉద్యమమని, ఆయన చూపిన ధైర్యం, త్యాగం నేటి తరానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. కొమరం భీమ్ ఆశయాలను గౌరవిస్తూ, ప్రభుత్వం ఈ మహనీయుడి జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా కలెక్టరేట్లలో నిర్వహించాలని స్పష్టం చేశారు.
అంతేకాక, ఆదివాసి జిల్లాల్లో వేడుకల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన భీమ్ వర్ధంతి కేవలం సంస్మరణ దినంగా మిగిలిపోకూడదని, గిరిజనుల హక్కుల పరిరక్షణకు పాలకులు పునరంకితం కావాల్సిన రోజుగా నిలపాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివాసి మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొమరం భీమ్ ఆశయ సాధనలో భాగంగా ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం రూపొందించిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం త్వరలోనే ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వెంకగారి భూమయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ అధ్యక్షులు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తోడుసం గోవర్ధన్, ఆదివాసి నాయకులు మంద మల్లేశ్, సూరపు సాయన్న, బోసాని రాజేశ్వర్, రాజుల నారాయణ, అజ్గుల్ సాయినాథ్, అత్రం రాజు, తొడుసం శంభు చెంచు రామకృష్ణ, సూరపు భోజన్న, సాకి నరసయ్య, జుగునాక సౌజన్య, ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.
