అనూహ్య ఘటనతో గందరగోళం
Snake attack: బస్సు ఆపలేదని వృద్ధ మహిళ హల్‌చల్ చేసింది. అధిక మోతాదులో మద్యం సేవించిన ఆమె బస్సుపైకి ఖాళీ బీరు సీసా విసరడంతో బస్సు అద్దం పగిలింది. అంతేకాకుండా బస్సు ఆపలేదన్న కోపంతో తన వద్ద ఉన్న పాము మహిళా కండక్టర్‌పైకి విసిరింది. దీంతో బస్సులో గందరగోళం నెలకొంది. అనూహ్య ఘటనతో ప్రయాణికులు హడలిపోయారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ విద్యానగర్‌లో ప్రధానరహదారిపై గురువారం సాయంత్రం జరిగింది. హైదరాబాద్‌లోని దమ్మాయిగూడకు చెందన బేగం అలియాస్ ఫాతిమా బీబీ అలయాస్ అసీం విద్యానగర్ చౌరస్తాలో బస్సు కోసం వేచి చూస్తోంది. సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్న దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన బస్సును ఆపాలని సదరు వృద్ధురాలు చెయ్యి ఎత్తింది. విద్యానగర్ బస్టాఫ్ తరువాత సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వద్ద బస్సు తిరుగుతున్నప్పుడు బస్సు ఆపాలని చెయ్యిఎత్తగా, మూలమలుపు కావడం, రద్దీగా ఉండడంతో డ్రైవర్ బస్సు అక్కడ ఆపలేదు.
దీంతో కోపోద్రిక్తురాలైన మహిళ తన వద్ద ఉన్న ఖాళీ బీరు సీసాను బస్సుపైకి విసిరింది. దీంతో బస్సు వెనుక అద్దం పగిలింది. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపేసాడు. అదే బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ స్వప్న కిందికి దిగి మహిళ పారిపోకుండా పట్టుకుంది. తప్పించుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో తన సంచీలో పాము ఉందని బెదిరించింది. సుమారు నాలుగు అడుగుల పొడవున్న జెర్రిపోతు పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరింది. పాము స్వప్నపై పడి నేలపైక జారిపోయింద. ఊహించని పరిణామంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఎక్కడి వార అటూ పరుగులు తీశారు. సంఘటనపై హైదరాబాద్ కమిషనరేట్ నల్లకుంట పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బేగంను అదుపులోకి తీసుకున్నారు. పాము కోస వెతుకగా అది దొరకలేదు.