Surjapur Lakshmi Venkateshwara Swamy Brahmotsavam 2025
Surjapur Lakshmi Venkateshwara Swamy Brahmotsavam 2025

Surjapur Lakshmi Venkateshwara Swamy Brahmotsavam 2025: గోవింద నామస్మరణతో పులకరించిన పుర వీధులు

  • భక్తుల కొంగు బంగారం సుర్జాపూర్ లక్ష్మీవేంకటేశ్వరుడు
  • మొక్కలు చెల్లించుకున్న భక్తులు

Surjapur Lakshmi Venkateshwara Swamy Brahmotsavam 2025: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో వెలిసిన అతి పురాతన క్షేత్రం అయిన, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడే శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా కొనసాగాయి. బుధవారం జాతర సందర్భంగా స్వామి వారి రథోత్సవ వేడుకలు వేలాది మంది భక్తుల మధ్య అత్యంత వైభవంగా సాగింది. గోవిందా నామస్మరణతో గ్రామంలో పుర వీధులు మారుమోగాయి. వేద పండితులు రథ ప్రాణ, ప్రతిష్ట, రథ బలి పూజలు చేశారు. గ్రామంలోని అన్ని వీధుల గుండా రథం వెళ్ళింది. భక్తులు రథాన్ని తాళ్లతో లాగుతూ… భక్తి పారవస్యంతో మునిగిపోయారు. స్వామి వారి పాటలను ఆలపించారు. యజ్ఞాచార్యులు డాక్టర్ చక్రపాణి నరసింహమూర్తి, ఆలయ అర్చకులు ఆచార్య కోటపెల్లి అనీష్, నితీశ్ ఆధ్వర్యంలో నిత్యార్చన విధి, శేష హోమం, పూర్ణా హుతి చక్రతీర్థం, బలిహరణ అభిషేకర్చనలు, హారతి, మంత్రపుష్పం, యజ్ఞం పూర్ణాహుతి వేద మంత్రాల మధ్య కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తుల తరలి వచ్చి తమ ఆరాధ్య దైవానికి మొక్కలు చెల్లించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా క్యూలైన్ ఏర్పాటు చేశారు. వివిధ దుకాణాలు భక్తుల సందడితో నెలకొంది. కమిటీ అధ్యక్షులు రాథోడ్ రామునాయక్, సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *