water problem: ఎల్లారెడ్డిపేట, మార్చి 30, (మన బలగం): తాగు నీటికి తల్లడిల్లిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పండగ పూట తండా వాసులు రోడ్డెక్కిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో గల పోచమ్మ తండాలో ఆదివారం జరిగింది. తండాలో నీటి గోస అంతకంతకు పెరుగుతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ఎండాకాలంలో తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడిందని, అధికారులకు చెప్పినా పట్టించుకోవాదం లేదని వాపోయారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఉందని ప్రభుత్వం మారినా ఇదే పరిస్థితి తలెత్తుతోందని అన్నారు. 10 సంవత్సరాలుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, బిందెలు పట్టుకొని చేలు, చెలకలు తిరుగుతూ నీళ్లు తెచ్చుకొని కాలం వెళ్ళదిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తమ గోడును ఆలకించి రెండు మూడు రోజుల్లో నీటి సమస్య పరిష్కరించక పోతే తండా వాసులతో ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోదావత్ రవీందర్ నాయక్ హెచ్చరించారు.