Nirmal Collector: జిల్లాలో ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఈ విషయం తెలిపారు. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములపై కొందరు వ్యక్తులు అక్రమంగా కన్నేసి నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు పొందినట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పొందిన పట్టాలను తక్షణమే రద్దు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆక్రమణకు గురైన భూమిని రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకుని పారిశ్రామిక శాఖకు అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి అని, దానిని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరగకుండా నిరంతర నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే ప్రజలు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.
