A group of ministers in Seoul: మన బలగం, తెలంగాణ బ్యూరో : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతోపాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, మేయర్ సోమవారం సియోల్ చేరుకున్నారు. చెత్తను రీసైకిల్ చేసి విద్యుత్‌గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ (WTE) కేంద్రాలను ఈ బృందం సందర్శించింది. చెత్త రీసైకిల్‌పై ఈ బృందం పూర్తి స్థాయిలో అధ్యయం చేయనుంది. వాటి పనితీరును పరిశీలించడంతోపాటు రీసైకిల్ విధానం, ఏ మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయిన విద్యుత్ ఏయే అవసరాలకు వినియోగించవచ్చు తదితర వివరాలను తెలుసుకోనుంది.
తెలంగాణ రాష్ర్టంలోనూ చెత్తను రీసైకిల్ చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా మంత్రుల బృందం సియోల్‌లో పర్యటిస్తోంది. రాష్ర్ట రాజధాని హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాల్లో నిత్యం టన్నుల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న డంపింగ్ యార్డుల నిర్వహణ రోజు రోజూ క్లిష్టంగా మారడంతో నూతన విధానాలు అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. సియోల్‌లో చెత్తను రీసైకిల్ చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. అదే విధానాన్ని రాష్ర్టంలోనూ అమలు చేయడం ద్వారా చెత్త సమస్యకు చెక్ పట్టడంతోపాటు కొంత మేర విద్యుత్ కొరత తీరే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ కలిసి వస్తే చెత్త రీసైక్లింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ త్వరలోనే రాష్ర్టంలో ప్రారంభించే అవకాశముంది.