MLC elections: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 21 (మన బలగం): పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై 24 జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా గట్టి నిఘా పెట్టాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడుల నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులకు తెలిపారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని, పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు తనిఖీ చేయాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, అక్కడ సీసీ కెమెరాలు లేదా నిరంతరాయంగా వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్రతి పోలింగ్ బృందానికి అవసరమైన మేర పోలింగ్ సామగ్రి, పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, పోస్టల్ బాక్స్ అదేవిధంగా చూడాలని, వీటి తరలింపుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు అందించాలని ఆయన తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలని, ప్రతి రెండు గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను జాగ్రత్తగా రిసెప్షన్ కేంద్రాలకు తీసుకొని రావాలని, పోలీస్ భద్రతతో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాలో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 22 వేల 397 మంది, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 950 మంది ఓటర్లతో ఓటు హక్కు వినియోగించుకుకొనున్నారని తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 28 పోలింగ్ కేంద్రాలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 13 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో రిజర్వ్ సహా మొత్తం 181 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని, వీరికి అవసరమైన శిక్షణ అందించమని అన్నారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉన్నాయని, రెవెన్యూ డివిజన్ అధికారులు తహసిల్దార్లు వచ్చే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయించి అక్కడ అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించాలని చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, వెబ్ టెస్టింగ్ ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ నాడు ప్రతి రెండు గంటలకు రిపోర్ట్ అందించేలా వ్యవస్థ సిద్ధం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు రాజేశ్వర్ రాధాబాయి డిఆర్‌డిఓ శేషాద్రి, జెడ్పి సీఈవో వినోద్ కుమార్ డి.డబ్ల్యు.ఓ లక్ష్మీరాజం సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.