Collector Abhilasha Abhinav: నిర్మల్, ఫిబ్రవరి 21 (మన బలగం): ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ మెరుగైన విద్య, నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మామడ మండలం రాసిమెట్ల ప్రభుత్వ ఐటిడిఏ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, సరుకుల గదులను పరిశీలించి ప్రతి రోజు విద్యార్థులందరికీ మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాల పరిసర ప్రాంతాలలో నిరంతరం మెరుగైన పారిశుధ్యాన్ని నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ పాఠశాలకు హాజరవుతూ వంద శాతం విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న స్టాకు, అటెండెన్స్, తదితర రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. అన్ని తరగతుల విద్యార్థులకు ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహిస్తూ వారి సామర్థ్యాలను పరీక్షించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల ప్రత్యేక తరగతులకు నిర్వహించి, పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. పలు సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధను కనబరచాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.