Nirmal Collector directs speedy resolution of Prajavani applications: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై అధికారులతో సమీక్షిస్తూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సర్వే త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలనీ సూచించారు. ఇప్పటికే జిల్లాలో 98 శాతం మొక్కలు నాటినట్లు చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విద్యాసంస్థల్ని సందర్శించాలని ఆదేశించారు. వినాయక నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న అధికారులందరినీ ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈనెల 10వ తేదీన జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన ఉందని, అధికారులంతా తమ తమ శాఖలకు సంబంధించిన నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
