Minister Duddilla: ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు అమూల్యమైన సలహాలు, సూచనలతో పాటు కలిసి రావాలని మంత్రి శ్రీధర్ బాబు హితో పలికారు. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు, రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజానీకం ఇబ్బందుల్లో ఉంది ఈ సమయంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా బురద రాజకీయాలను చేయడం సమంజసం కాదని మంత్రి శ్రీధర్ బాబు విపక్షాలకు చురకలు అంటించారు. రెండు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సుడిగాలి పర్యటన నిర్వహిస్తూ వరద ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కడెం, ఖానాపూర్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలలో మంత్రి విస్తృత పర్యటనలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రకృతి విపత్తులను సైతం రాజకీయం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల వల్ల భారీ నష్టం జరిగిందని,త్వరలోనే పంటలు, ఇళ్లు, పశు సంపద నష్టం అంచనాలను సిద్ధం చేయిస్తామని అన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికా వద్దని అన్ని వర్గాల ప్రజలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.