Minister Duddilla: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం రాత్రి ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాలు వరదల వలన కడెం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లకుండా దాదాపు 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసి గేట్లు, ఇతర మరమ్మత్తుల పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు.
భారీ వర్షాలు, వరదల వలన దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు, బ్రిడ్జిల వివరాలు, చేపట్టిన సహాయక చర్యలను సంబంధిత శాఖల ఆదికారులతో సమీక్షించారు. వరదల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యారోగ్య శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా నియంత్రించాలన్నారు. వర్షాలు ముగియగానే చేపట్టవలసిన చర్యలకు సంబంధించి ప్రణాళికలను వెంటనే పూర్తి చేయాలన్నారు. అధికారులంతా వారి కేంద్ర కార్యాలయాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రత్యేకాధికారులంతా వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ…అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రజలు ఎప్పుడు ఫోన్ చేసిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు మంత్రికి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చేపట్టిన చర్యలకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీఆర్వో భుజంగ్ రావ్, డీఎస్పీ గంగారెడ్డి, నిర్మల్, ముదోల్ ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్ రెడ్డిలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.