National Champion: నిర్మల్, అక్టోబర్ 18 (మన బలగం): వేదం గ్లోబల్ స్కూల్ కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని చిన్నోళ్ల ప్రశస్తిని ‘ఇండియా ఈస్ ఆస్’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన భారతదేశపు ప్రీమియర్ క్రియేటివిటీ నేషనల్ అండ్ ఇంటర్ స్కూల్ పెయింటింగ్, రైటింగ్ పోటీల్లో భాగంగా పవిత్ర స్వేచ్ఛ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జాతీయస్థాయిలో మూడవ స్థానంలో నిలచి ఉత్తమ ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థిని చిన్నోళ్ల ప్రశస్తి జాతీయస్థాయిలో మూడవ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థినికి, ఆమెను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భూపాల్ రెడ్డి, ప్రవళిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.