పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన పైడిపల్లి రాజు
CPI membership: కరీంనగర్, నవంబర్ 21 (మన బలగం): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం కరీంనగర్‌లోని 10వ డివిజన్ హనుమాన్ నగర్‌లో సీపీఐ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 26 శతాబ్ద ఉత్సవాలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శ్రామిక ప్రజల దళిత, బహుజనుల, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం, సమ సమాజ వ్యవస్థ ఏర్పడాలని, సమాజంలో కుల వివక్షత, ఆర్థిక, సాంఘిక, అసమనాతలు తొలగిపోవాలని నిర్విరామ పోరాటాలు చేస్తుందన్నారు. భారతదేశంలో గత వంద సంవత్సరాలుగా పేద ప్రజలకు కార్మికులకు అండగా సీపీఐ నిలబడి పోరాటం చేసిందన్నారు. వందేళ్లలో ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు ప్రజల పక్షాన నిలిచిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడల్లా సీపీఐ ప్రజల పక్షాన నిలబడి పాలకుల మెడలు వచ్చిందన్నారు.
ఈరోజు పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది సీపీఐ పోరాటం అన్నారు. దేశంలో కోట్లాది మందికి భూ పోరాట నిర్వహించి భూములు పంచిన చరిత్ర సీపీఐదే అని పేర్కొన్నారు. కార్మిక చట్టాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి అంటే దాని కారణం ఎర్రజెండా సీపీఐ పోరాట ఫలితమేనని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబులను తరిమికొట్టి హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేసిన ఘన చరిత్ర సీపీఐ పార్టీ దని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలో సీపీఐ ప్రజల కోసం నిలబడి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి వేలాది మందిని బలి ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ప్రజలను విముక్తి చేసిందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ నగరంలో సీపీఐ సత్తా చాటాలని, దానికి సభ్యత్వాన్ని డివిజన్‌లలో చేసి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ పదో డివిజన్ నాయకులు బైరి విజయ్, వీరనారాయణ, సుగ్రీవు, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.