- దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పన
- వినూత్న ఆలోచనతో వారి జీవితాల్లో వెలుగు
- రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
- తోడ్పాటు అందించాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Transgenders Petrol Bunk: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం. 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు నిరంతరాయంగా నాణ్యమైన సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నది. తక్కువ వ్యవధిలోనే వినియోగదారుల మెప్పు పొందుతూ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆర్థిక పునరావాసం కింద దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాలతో రూ.2.50 కోట్ల విలువైన భూమి రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం కేటాయించింది. రూ.2.50 కోట్లతో ఐ.ఓ.సీ.ఎల్ యాజమాన్యం మంజూరు చేసి బంక్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్నది.
సిరిసిల్ల రెండో బై పాస్ రోడ్‌లో
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ నుంచి రగుడు వరకు ఉన్న రెండో బైపాస్ రోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో ఐ.ఓ.సీ.ఎల్ ఆధ్వర్యంలో బంకును ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలిసి ప్రారంభించారు.
24 మందికి ఉపాధి
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 24 మంది దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు పెట్రోల్ బంక్‌లో ఉపాధి కల్పించేందుకు అధికారులు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. ప్రతి రోజూ 24 గంటలు సేవలు అందిస్తున్నారు. మూడు షిఫ్ట్‌లలో సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.
రోజుకు రూ.లక్ష అమ్మకాలు
రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బంక్‌లో వినియోగదారులకు సేవలు అందుతున్నాయి. నాణ్యత, కొలతల్లో మంచి గుర్తింపు సాధించి ముందుకు సాగుతుంది. స్వల్ప వ్యవధిలోనే ప్రతి రోజు దాదాపు రూ.లక్ష విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేస్తున్నారంటే ఈ బంక్‌కు వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన ఉందో తెలుస్తుంది.
తోడ్పాటు అందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశాం. దేశంలోనే ఇది మొదటిది. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పిస్తున్నాం. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయి. అందరూ పెట్రోల్ బంక్ సేవలు వినియోగించుకుని దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు తోడ్పాటు అందించాలి.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు: వేముల శ్రీనివాస్, తడగొండ, బోయినపల్లి
మా లాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడం గొప్ప విషయం. మాకు బంక్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
ఆర్థికంగా భరోసా: ఆకుల సంధ్య, పెద్దూర్
పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించాలనే ఆలోచన చాలా గొప్పది. మాకు ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కల్పించారు.
మాకు మంచి అవకాశం: వెల్ది గణేశ్, సిరిసిల్ల
నేను డిగ్రీ పూర్తి చేశాను. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని తెలిసి ఇక్కడ దరఖాస్తు చేసుకున్న, నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చారు.