Nirmal Collector: నిర్మల్, అక్టోబర్ 21(మన బలగం): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోవు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు, పట్టభద్రులు నవంబర్ 6వ తేదీ లోపు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకునే విధంగా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఓటరు నమోదు కొరకై తీసుకుంటున్న చర్యలను జిల్లాల వారిగా సమీక్షించారు. స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు సంఖ్య పెంచేందుకు అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక అధికారి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో అర్హులైన వారు తమ పేరును నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్వీప్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రోజువారీగా ఓటరు జాబితాలో నమోదు చేసుకుంటున్న వారి వివరాలు, ఏవైనా కారణాల చేత ఓటరు జాబితాలో పేరును తిరస్కరించినట్లయితే వాటి వివరాలను తమకు అందజేయాల్సిందిగా ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులకు ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఆర్ఓ భుజంగ్ రావ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.