- కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్
- ప్రజల దృష్టి మళ్లించేందుకు అరెస్ట్ డ్రామాలు
- లీగల్ నోటీసులకు సరైన సమాధానమిస్తా
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్
Bandi Sanjay: మనబలగం, తెలంగాణ బ్యూరో: ‘ఒక పార్టీలో చేరి ఇంకో పార్టీలో చేరిన వాళ్లను రాజకీయ వ్యభిచారులని అంటున్నడు కదా.. మరి మీ అయ్య మొదట ఏ పార్టీలో ఉన్నడు? ఇప్పుడు ఏ పార్టీ నడుపుతున్నడు? వేరే పార్టీలో గెలిచిన వాళ్లను చేర్చుకుని పార్టీని నడుపుతున్న వాళ్లను ఏమనాలే?’ పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇచ్చిన కౌంటర్ ఇది. రాజకీయ నేతలు భాష మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ నేతల భాష, వ్యవహారశైలిని చూస్తే అసహ్యమేస్తోందన్నారు. లీగల్ నోటీసులకు భయపడేది లేదని, దానికి సరైన రీతిలో సమాధానమిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ బదులిచ్చారు.
లీగల్ నోటీసులపై.. మొదట మాట్లాడిందెవరు? ఆయన మాట్లాడితేనే నేను కౌంటర్ ఇచ్చిన. అయినా భాష మాట్లాడేటప్పుడు హుందాగా ఉండాలి. సంస్కారవంతంగా ఉండాలే. డ్రగ్స్ వాడుతున్నవా? లేదా? ఫోన్ ట్యాపింగ్ చేయించినవా? లేదా? అనేదానిపై మీ అయ్య, మీ కుటుంబ సభ్యులంతా కలిసి గుండెమీద చేయి వేసుకుని ప్రమాణం చేయమని చెప్పిన. ఆయన లీగల్ నోటీస్ ఇస్తే.. నేను కూడా సరైన రీతిలో సమాధానమిస్తా. అరెస్ట్ చేస్తే అంతుచూస్తామనే కేటీఆర్ వ్యాఖ్యలపై.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నయ్. రెండ్రోజుల్లో బాంబులు పేలతాయని మంత్రులంటే.. అరెస్ట్ చేస్తే మీ అంతు చూస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నరు. ఇద్దరివి డ్రామాలే. నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను దెబ్బతిన్నట్లు నటిస్తానంటూ డ్రామాలాడుతున్నరు. మూసీపై బీజేపీ నిర్వహించిన ధర్నా సక్సెస్‌ను చూసి ఓర్వలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నయి.