Juvvadi Surya Rao is no more: ధర్మపురి, నవంబర్ 3 (మన బలగం): ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మాజీ చైర్మన్, మాజీ వైస్ ఎంపీపీ, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ జువ్వాడి సూర్య రావు(80) తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఆయన స్వగృహంలో సూర్య రావు పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న పలు పార్టీల నాయకులు, ప్రముఖులు, ప్రజలు సూర్య రావు పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూర్యరావు భౌతికకాయంపై పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్యమ్మ నివాళి అర్పించారు. సూర్యరావుకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు శ్రీదేవి హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. శ్రీదేవి ప్రస్తుత నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు సతీమణి కావడం గమనార్హం.