కేంద్రం అక్షింతలు తప్ప అభివృద్ధి లేదు
గాంధీది త్యాగాల కుటుంబం
జిల్లా ఇన్చార్జి మంత్రి దనసరి సీతక్క
Minister Sitakka: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పంపిన అక్షింతలు తప్ప ఎలాంటి అభివృద్ధికి నిధులను కేటాయించలేదని జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అధ్యక్షతన నిర్మల్ పట్టణంలో మూడు నియోజకవర్గాల బూతు లెవల్ కమిటీల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా ములుగు జిల్లాకు దగ్గర అవినాభావ సంబంధం ఉందని, అక్కడి సమస్యలు ఇక్కడి సమస్యలు ఒకేలా ఉన్నాయని అన్నారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తాను సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
పార్టీ కోసం కష్టపడండి, మీ వెంట నేనుంటా
జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయం కోసం కష్టపడండి.. మీకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు మీ వెంటే నేను ఉంటానని సీతక్క కార్యకర్తలకు, నాయకులకు హామీ ఇచ్చారు. సోమవారం నిర్మల్ లో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ మండలాలను గ్రూప్లుగా విభజించి పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. గ్రామాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేస్తూ గ్రామాల సంక్షేమానికి కేంద్రం ఏం చేసిందో ప్రజల ద్వారా తెలుసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమాలను వివరించాలని అన్నారు.
జననాయకులుగా గుర్తింపు పొందండి
కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త నుండి నాయకుని వరకు ప్రజల్లో ఉంటూ జననాయకుడిగా గుర్తింపు పొందాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉన్న నాయకునికి మంచి గుర్తింపు ఉంటుందని, ప్రజాధరణ లభిస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల్లో ఉంటూ సేవచేసే నాయకులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జుట్టు అశోక్, సత్తు మల్లేశం, నాయకులు శ్యాం నాయక్, మహిళా నాయకురాలు దుర్గా భవాని తదితరులు పాల్గొన్నారు.