Collector Abhilash Abhinav: నిర్మల్, నవంబర్ 4 (మన బలగం): ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, శాఖల వారీగా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలని, పరిష్కారానికి సంబంధించిన వివరాలను సంబంధిత దరఖాస్తుదారుడికి అందజేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, గన్ని బ్యాగ్స్, టార్పాలిన్, వేయింగ్ మిషన్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో అన్నిచోట్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.
ప్రభుత్వ హాస్టళ్లను తనిఖీ చేయాలి
ప్రభుత్వ హాస్టలను నిరంతరం పర్యవేక్షించి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని విధాల వసతులు కల్పించాలని అన్నారు.
సమగ్ర సర్వేకు సహకరించాలి
సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సర్వేకు వచ్చే బృందాలకు అన్ని విధాలుగా సహకరించాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఈ నెల 6న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేర్ల నమోదు ప్రక్రియ గడువు ముగుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.