T20 World Cup Afghanistan vs Uganda: టీ 20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ (Afghanistan), ఉగాండాల (Uganda) మధ్య మంగళవారం ఉదయం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అఫ్గానిస్తాన్‌లో రషీద్ ఖాన్(Rashid Khan), నబీ, ముబీబ్ రెహమన్, రహ్మనుల్లా గుర్జాబ్ లాంటి ప్లేయర్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. కొంతమంది ఐపీఎల్‌తో పాటు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడుతూ తమ ఆటను మెరుగుపరుచుకున్నారు.
ఉగాండా టీం ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో జింబాబ్వేను ఓడించి టీ20 వరల్డ్ కప్‌నకు క్వాలిఫై అయింది. ఉగాండా గతేడాది 35 టీ 20 మ్యాచులు ఆడగా.. 30 మ్యాచుల్లో గెలిచింది. ఇది కూడా టీ 20 వరల్డ్ కప్‌నకు క్వాలిఫై అవడానికి మరో కారణం అని చెప్పొచ్చు. గతేడాది ఆడిన అన్ని మ్యాచుల్లో ఉగాండా ఆఫ్రికాలో ఆధిపత్యం కనబర్చింది. కానీ మిగతా చోట్ల మాత్రం దాని సత్తా చూపించలేకపోయింది. ఉగాండా స్పిన్నర్ నసుబా (43) సంవత్సరాలు టీ 20 క్రికెట్‌లోనే అతి పెద్ద వయసు ఉన్న క్రికెటర్‌గా ఈ టోర్నీలో ఆడనున్నాడు.
2009 డివిజన్ 3 క్వాలిఫయర్‌లో అఫ్గానిస్తాన్‌పై ఉగాండా గెలిచింది. అప్పటి టీంలో ఉన్న ఆల్ రౌండర్ నసుబా చెలరేగి ఆడి 66 పరుగులు చేసి ఉగాండా విక్టరీలో పాలు పంచుకన్నాడు. 2009 నాటి మ్యాచ్‌లో అఫ్గాన్ తరఫున మహమ్మద్ నబీ కూడా టీంలో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ ఈ టీ 20 వరల్డ్ కప్‌లో తమతమ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తుండటం విశేషం. 2009 డివిజన్ మ్యాచ్‌లో అఫ్గాన్‌పై ఉగాండా గెలిచినా.. తర్వాత జరిగిన మ్యాచుల్లో సరిగా ఆడలేక పాయింట్ల టేబుల్స్‌లో వెనకబడింది.
అఫ్గానిస్తాన్ మాత్రం ఇండియాలో క్రికెట్ ఆడి రోజు రోజుకుమరింత మెరుగుపడి టాప్ 10లో స్థానం దక్కించుకుంది. ఒకప్పటి కెన్యా, జింబాబ్వే, కెనడాలను దాటి అఫ్గానిస్తాన్ మెరుగ్గా ఆడుతూ.. అన్ని టోర్నీలకు క్వాలిఫై అవుతోంది. ఉగాండాను తక్కువ అంచనా వేస్తే మాత్రం జింబాబ్వేకు పట్టిన గతే అఫ్గానిస్తాన్‌కు పడుతుందని క్రికెట్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఎందుకంటే ఉగాండాలో ఎవరూ ఎలా ఆడతారో చెప్పలేం.