Misses World International 2024: మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫైనల్ పోటీల్లో నిర్మల్‌కు చెందిన ప్రముఖ వైద్యురాలు చంద్రిక రాణించారు. ఢిల్లీలోని గుర్‌గావ్‌లో జరిగిన మిసెస్ వరల్డ్ ఫైనల్ పోటీల్లో పాల్గొన్న చంద్రిక ప్రపంచ అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన డాక్టర్ అవినాష్ ప్రభుత్వ వైద్యులుగా, డాక్టర్ చంద్రిక దేవి బాయి ఆస్పత్రి నిర్వాహకురాలు. డాక్టర్ చంద్రికకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు మహాలక్ష్మి, కుమారుడు సూర్య వర్ధన్ కృష్ణ ఉన్నారు. ఒకపక్క ఆస్పత్రిలో వైద్యురాలిగా, మరోపక్క పిల్లలకు తల్లిగా తన పాత్రను బాధ్యతగా పోషిస్తూనే మిసెస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజయం సాధించడం పట్ల పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. 2024 సంవత్సరంలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రపంచ దేశాల నుంచి 140 మంది మహిళలు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణం నుంచి పాల్గొన్న డాక్టర్ చంద్రిక మిసెస్ వరల్డ్ పోటీలో కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రికను భర్త డాక్టర్ అవినాష్ కుటుంబ సభ్యులు దేవి బాయి, పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.