CM Revanth Reddy: వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థిని మాటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇంప్రెస్ అయ్యారు. విద్యార్థిని సీఎం ఎదుటే అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుత విద్యావిధానాన్ని ప్రశ్నిస్తూనే ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలు కావాలో వివరించారు. ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. స్కూళ్లలో నాణ్యమైన విద్య అందాలంటే ఏం చేయాలో చక్కగా వివరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
విద్యార్థిని ఏం మాట్లాడిందంటే
‘అందరికీ నమస్కారం. నా పేరు వనకృతి. మాది వరంగల్ జిల్లా. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాను. 10 జీపీఏ సాధించాను. నాన్న కార్పెంటర్. కూలి, నాలి చేసుకుంటే తప్ప కుటుంబం గడవని పరిస్థితి మాది. నా విన్నపం ఏమిటంటే ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి కోర్సులు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నాయి. అక్కడ ఐదో తరగతి నుంచి అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అలా లేదు. ఈ కోర్సులను ప్రభుత్వ పాఠశాలల్లోనూ తీసుకు రావాలి. మధ్యాహ్న భోజనం, రవాణా సౌకర్యం కల్పించాలి. నాణ్యమైన విద్య కోసం దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు నడుచుకుంటూ వస్తున్నారు. వీటన్నింటీని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఉపాధ్యాయులు బదిలీపై వేరే జిల్లాకు వెళ్తున్నారు. కొందరు రిటైర్ అవుతున్నారు. ఆ ఖాళీ పోస్టులు అలాగే ఉంటున్నాయి. దీంతో పలు సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులకు పాఠాలు పూర్తి కావడంలేదు.
పోస్టులను భర్తీ చేసి విద్యార్థులు నష్టపోకుండా అన్ని సబ్జెక్టుల పాఠాలు పూర్తయ్యేలా చూడాలి. పిల్లలు బట్టి మెథడ్ కన్నా ప్రాక్టికల్‌గా చదువుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది. అర్థమవుతుంది. ఇందు కోసం లాబొరేటరీలు, లైబ్రరీలు, ఎక్విప్మెంట్లు ప్రభుత్వ పాఠశాలలకు అందించాలి. ఇవన్నీ చాలా అవసరం. మా పాఠశాలలో నవంబర్‌లో మాకు సిలబస్ పూర్తి చేశారు. రివిజన్ సైతం పూర్తయ్యింది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ‘గవర్నమెంటు స్కూలా? గవర్నమెంటు స్కూలా?’అని అన్నారు. వారందరికీ వెలెత్తి చూపేలా 10/10 సాధించి ఆదర్శంగా నిలిచాను. నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇక్కడ ఉన్న 10/10 జీపీఏ సాధించిన అందరికి మిత్రులకు ఇంటర్లో ఉచిత ప్రవేశాలు కల్పించాలి.’ అని సభలో విద్యార్థిని వనకృతి ప్రసంగించారు.
సీఎం ఏం మాట్లాడారంటే
అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, తాను సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారమే అని గుర్తుచేశారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు. 90 శాతం ఐఏస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారేనని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు. కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.