Money is the enemy: ‘ధనమూలమిదం జగత్’ అన్న మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. దీని అర్థమేమిటంటే ఎవరి దగ్గరైతే సిరిసంపదలు (Money) ఉంటాయో వారికి సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. సకల సౌకర్యాలు, సౌక్యాలు సమకూరుతాయి. హితులు, స్నేహితులు, బంధువులు ఇలా ఒక్కరేమిటి అన్ని రకాల చుట్టరికాలు కలుపుకుపోయే వారికి కొదువే ఉండదు. ఆప్తులు, ఆత్మీయులతోపాటే మనమంటే గిట్టనివారు, అసూయా పరులు పుట్టుకొస్తారు. మనతో మిత్రుత్వాన్ని నటిస్తూనే వెనుక గొయ్యి తీస్తుంటారు. మన ముందు ఒకలా, వెనకాల మరోలా ఉంటారు. మన వెనకాల భజన బృందం తయారవుతుంది. అందులో ఎవరు ఎలాంటి వారో చెప్పడం కష్టమే. మనకు మంచి చేసే వారెవరు? కీడు చేసేవారు ఎవరు? గుర్తించడం అసాధ్యమే. వారి ప్రవర్తనను బట్టి గుర్తిద్దామా అంటే ఎక్కడా చిక్కరు.
స్వాతిముత్యంలా మన ముందు స్వచ్ఛమైన నేతి మాటల మూటలు విప్పుతారు. తేనె పూసిన కత్తా లేక, షాక్ కొట్టే కరెంటు తీగా అన్నది అనుభవంలోకి వస్తేగాని తెలియదు. ఇలాంటి వారి పట్ల నేర్పుగా ఉండడం తప్ప మరో ఉపాయం లేదు. పాలలోంచి నీటిపి వేరు చేసే హంసలా మన చుట్టూ ఉండే వారి గుణగణాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వారి తీయని మాటలను నమ్మితే మోసపోక తప్పదు. అసూయాపరులకు చిక్కకుండా, వారి కుట్రలు, కుతంత్రాలకు దొరక్కడా జాగ్రత్తపడడం అలవాటు చేసుకోవాలి. మన ఆప్తులను మనకు దూరం చేసేందుకు అనువైన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. బంధుత్వంలో మనకున్న మంచి పేరును చెడగొట్టేందుకు కుయుక్తులు పన్నుతారు. పాముకు కోరల్లోనే విషముంటుంది. కానీ మనకు కీడు చేయాలని తలచిన వారికి నిలువెల్లా విషమే ఉంటుంది. ఎప్పుడు మనపై బుస కొడదామా అని వేచి చూస్తుంటారు.
అసూయ, ద్వేషంతో రగిలిపోతూనే మనతో స్నేహాన్ని నటిస్తారు. మన సంపద పెరుగుతున్నా కొద్దీ శతృ పీడ (enemy) అంతకంతకూ పెరుగుతూనే మన నీడై వెంటాడుతుంది. మన మంచితనంతో అందరూ మనవారే అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. నమ్మి మోసపోవడం ఎంతటి వెర్రితనంతో స్వీయానుభమే చెప్తుంది. ఎవరు మనవారు? ఎవరు పరాయి వారు? అన్న భావన మనల్ని వెంటాడుతూ ఉంటే మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. అలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించి సమయం వృథా చేసుకోవడం మంచిది కాదు. సంపదలు వచ్చి చేరుతున్నా ప్రశాంతత లేకుంటే నరకప్రాయమైన జీవనం గడపాల్సి వస్తుంది. సమయోచితంగా వ్యవహరించడం, విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోడం ఉత్తమం. మనకు అపకారం చేసే వారి కోసం వెతికేకన్నా ప్రశాంత చిత్తంతో ఉండడం మేలు. మనల్ని ఒంటరి చేయడమే పనిగా పెట్టుకునే వారూ ఉంటారు.
అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన ముందు మనకు మంచి చెప్పినట్లు నటిస్తూనే వెనుక తీవ్రమైన విమర్శలు చేస్తూ రాక్షసానందం పొందుతుంటారు. అలాంటి వారి గురించి చింతాల్సిన పనిలేదు. దండెత్తివచ్చే అసూయ, ద్వేషం, కక్ష, కుల్లు, కుతంత్రాలతో నిత్యం ప్రతిఘటించకతప్పదు. కార్యోన్ముఖులై ముందుకు సాగడమే సముచిత నిర్ణయం. మనకు సుస్తి చేస్తే ఔషధం తీసుకుంటే తగ్గుతుంది. కానీ శతృపీడ వినాశనానికి ఎలాంటి మార్గం లేదు. మనం నేర్పుగా అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. నేర్పు అంటే మనకు కీడు చేయాలని కుయుక్తులు పన్నే వారి పట్ల జాగురూకతతో ఉండడం అన్నమాట. మన వెంటే ఉంటూ మనల్ని అధ:పాతాళానికి తొక్కాలని చూసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చీమలు పెట్టిన పుట్టలోకి పాముల్లా చేరాలనుకుంటారు. తేనెటీగలు కష్టపడి సేకరించిన పెట్టుకున్న తేనెను కొల్లగొట్టాలనుకుంటారు. మంచీ చెడు ఏదైనా కావొచ్చు ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. సందతోపాటు పెరిగే శతృవులను గర్తించలేం కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.