రామ నామస్మరణతో మార్మోగిన కొండగట్టు
KONDAGATTU: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం కొండగట్టులో మూడు రోజులుగా నిర్వహిస్తున్న హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ దీక్ష పరులతో కొండగట్టు పరిసర ప్రాంతాలు రామ నామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజామున మూలవిరాట్‌కు లక్ష తమలపాకులు, పూలు, పండ్లతో స్వామివారిని అలంకరించారు. ఉదయం నుంచి నిర్వహిస్తున్న వివిధ పూజ కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి, ఉయ్యాల సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి దీక్ష స్వాములు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు జితేంద్ర స్వామి, స్థాన చార్యుడు కపిందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మల్యాల సీఐ నీలం రవి పర్యవేక్షణలో పటిష్టమైన భారీ బందోబస్తు నిర్వహించారు.