- చుక్కలు చూపించిన సూర్య
- నిప్పులు చెరిన బుమ్రా
- భారత్ ఆల్‌రౌండ్ షో
- 181 పరుగులు చేసిన ఇండియా
- 134 పరుగులకే అఫ్ఘనిస్తాన్ ఆలౌట్
- 47 పరుగుల విక్టరీ
India vs Afghanistan, T20 World Cup 2024: బుమ్రా మాయాజాలం.. అర్షదీప్ కట్టుదిట్టమైన బౌలింగ్.. సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీ.. ఇలా భారత్ ఆల్‌రౌండ్ షో ప్రదర్శించి అఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి అఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించాడు. బుమ్రా వేసిన నాలుగు ఓవర్లలో ఒకటి మేడిన్ కావడం విశేషం. నిప్పులు చెరిగే బంతులతో అఫ్ఘాన్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. రెండో ఓవర్ నుంచి బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా ప్రతి ఓవర్‌లోనూ వికెట్ తీస్తూ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. మరో ఎండ్‌లో అర్షదీప్ చక్కని బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ నాలుగు ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రవీంద్ర జడెజా మూడు ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. దీంతో 47 పరుగుల తేడాతో భాతర్ ఘన విజయాన్ని కైవసం చేసుకున్నది.
సూర్య అర్ధ సెంచరీ
కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్‌లో గురువారం అఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ 8(13) పరుగులకే వెనుదిరిగాడు. కొహ్లీ 24 (24) పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషబ్ పంత్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 20(11) పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా సూర్యకుమార్ యాదవ్ తన సహజ సిద్ధ శైలిలో ఆటతీరును ప్రదర్శించాడు. 28 బంతుల్లో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లు బాది 53 పరుగులు చేశాడు. ఫజల్ ఫరూఖీ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. శివమ్ దూబే 10(7) పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 24 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో అజ్మతుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 7, అక్షర్ 12, అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేశారు. ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది.
134 పరుగులకే ఆలౌట్
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘనిస్తాన్ లక్ష్యాన్ని ఛేదించలేక చతికల పడింది. బుమ్రా దెబ్బకు 134 పరుగులకే చాప చుట్టేశారు. అజ్మతుల్లా ఒమర్ జాయ్ మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు గుర్బాజ్ 11, అజ్రతుల్లా 2 పరుగులు మాత్రమే చేశారు. వీరిద్దరినీ బుమ్రా పెవిలియన్‌కు పంపడంతో అఫ్ఘనిస్తాన్ పతనానికి ఆరంభం పలికినట్లైంది. జర్దాన్ 8, గులాద్దీన్ నబీ 17, ఒమర్ జాయ్ 26, నజీబుల్లా జర్దాన్ 19, మహ్మద్ నబీ 14, రషీద్ ఖాన్ 2, నూర్ అహ్మద్ 12, నవీన్ ఉల్ హక్ 0, ఫజల్ ఫారూఖీ 4 పరుగులు చేశారు. 134 పరుగులు అప్ఘాన్ ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 47 పరుగులతో భారీ విక్టరీని అందుకున్నది. అర్ధసెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ దీ మ్యాచ్ దక్కింది.