Basara Godavari Aarti: బాసర గోదావరికి నిత్య హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీ పుణ్యక్షేత్రంలో హారతి కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. అలాగే బాసరలోనూ నిరంతరాయంగా హారతి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. వేదభారతి పండితులు, అధ్యాపకులు గురుణచరణ్ వివరాలు వెల్లడించారు. వేద విద్యానంద గిరిస్వామి బాసరలో వేద భాతరి పీఠం అభివృద్ధికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. వేద పాఠశాల, గోశాల నిర్వహణతోపాటు నిత్య గంగాహారతి నిర్వహించాలని సంకల్పించారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం వేదాల విశిష్టతను వివరిస్తూ వేద విద్యానందగిరి స్వామి రచించిన ఇంటింటా వేదం పుస్తకాన్ని ఆవిష్కరించారు. హైందవ ధర్మ పరిరక్షణకు వేద పీఠాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం వేద పాఠశాలలో 80 మంది విద్యార్థులు వేదాలను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. వేద పాఠశాలను విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే సంకల్పంతో ముందుకెళ్తున్నామని వివరించారు.