Pani Puri
Pani Puri

Pani Puri: పానీ పూరీ చరిత్ర చెప్పే నిజాలు మహాభారతానికి లింకేంటి

Pani Puri: పానీ పూరీ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందరూ ఎంతో ఇష్టంగా తినే పానీ పూరీ అసలు ఎప్పుడు పుట్టింది? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది ? అని ఎప్పుడైనా ఆలోచించారా? పానీపూరీకి గప్‌చుప్, గోల్‌గప్పా, పుచ్కా, పుల్కి ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఎక్కడ? ఎవరు? ఏ పేరుతో పిల్చుకున్నా మనం మాత్రం మన పానీపూరీనే అని పిలుస్తాం. కాలేజీకి వెళ్లినప్పుడో, ఫ్రెండ్స్‌తో షికారుకు వెళ్లినప్పుడో, ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్లినప్పుడో పానీ పూరీని ఓ పట్టు పట్టనిదే ఇంటికి తిరిగి రానివారు చాలా మందే ఉంటారు. గుండ్రని పూరీలో ఆలుగడ్డ ముక్కలు, బఠాణీలతో వండిన కర్రీ వేసి పానీ (పుదీనా నీటి)లో ముంచి మనకు ప్లేట్‌లో సర్వ్ చేసిన క్షణాల్లోనే గుటకాయ స్వాహా చేసేస్తాం. ఒక్క బుక్కలో నోట్లో కుక్కేసి మరో పానీ పూరీ కోసం ఎదురు చూస్తుంటాం. ప్లేట్‌లో పక్కనే ఉల్లిపాయ ముక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందే. పానీపూరీపై కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తే దానికి మరింత టేస్ట్ జోడించినట్లవుతుంది.

పానీ పూరీ ఎప్పుడు పుట్టిందంటే?

మహాభారత కాలం నుంచి పానీ పూరీ రాజ్యమేలుతున్నట్లు పురాణాలను బట్టి తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒక కథ సైతం ప్రచారంలో ఉంది. పాండవులను పెళ్లి చేసుకొని వచ్చిన ద్రౌపదికి అత్త కుంతీదేవి పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటుంది. వనవాస సమయంలో తక్కువ వనరులతో భర్తలకు ఆహారాన్ని ఎలా వండుతుందో చూద్దామని ఈ పరీక్ష పెట్టాలని అనుకుటుంది. కొద్ది మొత్తంలో గోధుమ పిండి, కొన్ని కూరగాయలు ఇచ్చి వంట చేయమని చెబుతుంది. అత్తగారు ఇచ్చిన వాటితో వంట ప్రారంభిస్తుంది ద్రౌపది. పిండితో చిన్న చిన్న పూరీలు చేస్తుంది. నీటిలో కొన్ని పదార్థాలు వేసి ఘాటైన రుచి వచ్చేలా చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి పాండవులు ఎంతో ఇష్టంగా తింటారు. వారికి బాగా నచ్చుతుంది. ఆ తరువాత మెల్లిగా ప్రజల్లోకి కొత్త వంటకం చేరిందని తెలుస్తోంది.

మగధ సామ్రాజ్యంలో పుట్టిందా?

అయితే మరో చారిత్రక ఆధారాలను సైతం చరిత్ర కారులు రుజువు చేస్తున్నారు. పానీ పూరి మగధ సామ్రాజ్యం నుంచి ఉందని చరిత్రకారులు నొక్కి మరీ చెబుతున్నారు. మగధ సామ్రాజ్య పాలనలో ఓ వ్యక్తి పుల్కీ పేరుతో దీన్ని మొదట తయారు చేసినట్లు ఆధారాలు లభించినట్లు చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. అప్పటి మగధ అంటే ప్రస్తుతం బిహార్ దక్షిణ ప్రాంతం అన్నమాట. పానీపూరీ ఎక్కడ పుట్టినా ప్రపంచ వ్యాప్తంగా దీనికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలా బయటికి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లోనూ ప్రత్యేక సందర్భాల్లో పానీ పూరి చేసుకొని ఇంటిల్లిపాది ఆ రుచులను ఆస్వాదించడం పరిపాటే. పెళ్లిళ్లు, శుభాకార్యాల్లో ప్రత్యేక స్టాల్స్ పెట్టి మరీ పానీ పూరి అందిస్తున్నారంటే దీని ప్రత్యేక వేరే చెప్పక్కర్లేదు.

తస్మాత్ జాగ్రత్త

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బయట తినే పానీపూరీతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సుచీశుభ్రత పాటించని చోట పానీ పూరీ తిని అనారోగ్యం కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణం ఉండే చోటే వీటిని తినాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంటి వద్దే చేసుకొని ఆరగిస్తే ఇంటిల్లిపాది హ్యాపీగా ఉండడంతోపాటు ఆరోగ్యం సేఫ్ అన్న సంగతి మరవకండి. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ప్రతి సంవత్సరం జూలై 7వ తేదీన పానీపూరీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *