Aarogyasri Card: పేదల ప్రజలకు రాష్ర్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్య సేవలు పొందేందుకు అర్హులని ప్రకటించింది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా వైద్య సేవలు పొందేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. రేషన్ కార్డుకు, ఆరోగ్య శ్రీ కార్డుకు లింక్ పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం పై నిర్ణయాన్ని వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ ఆరోగ్యశ్రీకార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిగతులకు సంబంధించి డిజిటల్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నారు.
ఇందుకు ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ జారీ చేయాలని యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి విధివిధానాలు రూపొందించనున్నారు. అనంతరం జీవో విడుదల చేసే అవకాశముంది. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువగా అందించి ప్రోత్సహించాలని సూచించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బెడ్లకు సీరియల్ నెంబర్లు కేటాయించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్లు చొరవ చూపాలని తెలిపారు. దవాఖానలకు నిర్వహణకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని తెలిపారు.