Nirmal Collector Abhilash Abhinav
Nirmal Collector Abhilash Abhinav

Nirmal Collector Abhilash Abhinav: రైతు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది

నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal Collector Abhilash Abhinav: రైతు అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం శ్రీ వెంకట సాయి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా పెంబి మండల కేంద్రానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌కు మహిళలు, రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి వెలిగించి, రైతుతో రిబ్బన్ కట్ చేయించి సంస్థ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సంస్థ కార్యకలాపాలు, ఎరువులు, విత్తనాల సరఫరా, పంటల దిగుబడి, మార్కెటింగ్ సౌకర్యాలపై జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పంటలు సాగు చేసి, రైతులు అధిక దిగుబడులు సాధించాలని అన్నారు.

రైతులు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మారుమూల ప్రాంతమైన పెంబి మండల కేంద్రంలో 350 మంది రైతుల సమష్టి కృషితో ఉత్పత్తిదారుల సంస్థను స్థాపించడం అభినందనీయమని అన్నారు. ఈ సంస్థ ద్వారా 10 గ్రామపంచాయతీలలోని 18 హెబిటేషన్లలో దాదాపు 4 వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని అన్నారు. సంస్థకు అవసరమైన వసతులు కల్పించడంతోపాటు రైతుల అభివృద్ధికి వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు సూచనలు అందించాలని ఆదేశించారు. సంస్థలో మహిళ రైతుల భాగస్వామ్యం పెంచేలా కృషి చేయాలని సూచించారు. సంస్థ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, రైతులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని లాభాలు సాధించాలని కోరారు.

ప్రతి 3 నెలలకు ఒకసారి సంస్థ పురోగతిని పరిశీలించి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. అంతకుముందు సంస్థ అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల మేలు కోసం మారుమూల ప్రాంతంలో 350 మంది సభ్యులతో సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి చేపట్టనున్న కార్యకలాపాలను ఆయన వివరించారు. అనంతరం మహిళా సభ్యురాలు సోంబాయిని కలెక్టర్ శాలువాతో సన్మానించారు. కలెక్టర్ బొమ్మ గీసిన నవిత చిత్రపటాన్ని, మోహన్ అనే రైతు నాగలిని కలెక్టర్‌కు బహుకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, నాబార్డ్ డీడీ వీరభద్రుడు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమణ, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో రమాకాంత్, అధికారులు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *