BRS: నిర్మల్ జిల్లా కేంద్ర సమీపంలోని చించోలి (బీ) గ్రామంలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మంగళవారం సాయంత్రం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మైనార్టీ విద్యాసంస్థలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ప్రకాశ్‌తో నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ నియమ నిబంధనలను ఆదేశాల ప్రకారం తగిన విధంగా సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. స్థానికంగా విద్యార్థుల సంఖ్యగా అనుగుణంగా పూర్తిస్థాయి మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి సదరు విద్యాసంస్థలను ఇప్పటివరకు సందర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే మైనార్టీల రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో విద్యార్థులకు నిత్యం పడరాని పాట్లు పడాల్సి వస్తున్నదని ఆరోపించారు. జిల్లా విద్యాధికారి సదరు విద్యాసంస్థలను సందర్శించడం పర్యవేక్షించడం లాంటిది చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు సయ్యద్ ఖాజా అక్రం అలీ, మొహమ్మద్ బిన్ అలీ మొహమ్మద్ మసూద్ ఖాన్, రిజ్వాన్ ఖాన్, మహమ్మద్ మహెబూబ్, ఫహీం, మహెమూద్, మహమ్మద్ నాయిమోద్దీన్ మహమ్మద్ హబీబ్, మహమ్మద్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.