Prajavani: నిర్మల్, అక్టోబర్ 21 (మన బలగం): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శాఖల వారీగా ప్రజావాణి కార్యక్రమమంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జన సురక్ష యోజన పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం వల్ల కలిగే లాభాలను గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులంతా పిఎం విశ్వకర్మ పథకానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువమందిని తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఆర్ఓ భుజంగ్ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.