Food Inspector: నిర్మల్, నవంబర్ 7 (మన బలగం): హోటల్, రెస్టారెంట్ల వ్యాపారస్తులు ప్రభుత్వ నియమాలు కచ్చితంగా పాటించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక మయూరి హోటల్లో హోటల్, రెస్టారెంట్, కిరాణా, మిఠాయిల దుకాణల యజమానులతో ఆమె అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఆహార పదార్థాల, తినుబండారాల, తయారీదారులు ప్రజలకు పరిశుభ్రమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, వస్తువులు వాడినట్లు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. నాణ్యతలేని ఆహార పదార్థాలను, కల్తీ ఆహార పదార్థాలను విక్రయించకూడదని తెలిపారు. ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ ఫుడ్ కలర్ వాడకూడదన్నారు. యజమానులందరూ ఆహార పదార్థ విక్రయ లైసెన్సులు కలిగి ఉండాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, హోటల్, రెస్టారెంట్, కిరాణా, మిఠాయిల దుకాణల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.