- అధిష్టానం ఆదేశంతో ఊపందుకున్న వలసలు
- కేసీ సూచనతో బలమైన నేతలను చేర్చుకునేలా ప్లాన్
- పార్లమెంటు ఎన్నికల నాటికి మరింత మంది వస్తారనే ధీమాలో అధికార పార్టీ
- చేరికలు కలిసి వచ్చేనా? మెజార్టీ సీట్లు సాధించేనా?
CONGRESS PARTY JOINING JOSH: అధికారం ఏ పార్టీ చేతిలో ఉంటే ఆ పార్టీలోకి వలసలు కామన్. కానీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కొందరు టికెట్లు ఆశించి, మరికొందరు ఇతర పదవులు ఆశించి పార్టీ మారుతున్నారనే విమర్శలున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. పదేండ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధించేలా ముందుకు సాగుతున్నది. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక పార్టీలో చేరిక జోష్ కనిపిస్తున్నది. జిల్లాల వారీగా బలమైన నేతలతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అప్పుడు అనుకున్నారు.. ఇప్పుడు చేస్తున్నారు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మె్ల్యేలు, జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్లు తదితర కేడర్ నాయకులు హస్తం గూటికి చేరాలని తహతహలాడారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్గం వెంకట్రావ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో తుక్కుగూడ సభకు ముందు భారీగా చేరికలుంటాయని అందరూ భావించారు. కానీ ఎందుకో ఆ సమయంలో చేరికలు మందగించాయి. ఇతర పార్టీల నుంచి నేతలు భారీ సంఖ్యలో చేరేందుకు సుముఖంగా ఉన్నారన్న సంకేతాలు వినిపించాయి. కానీ పెద్దసంఖ్యలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు ఇష్టపడలేదు. ఈ క్రమంలో చేరికలు ఎందుకు మందగించాయేమోనన్న చర్చ మొదలైంది. పరిస్థితులను గమనించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దీనిపై సీఎం, మంత్రులు, ఇతర నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే వారిని రానివ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గ్రీన్ సిగ్నల్ రాగానే.. పెరిగిన తాకిడి
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయా జిల్లాల పరిధిలో ఏ పార్టీ నేతలు వచ్చినా చేర్చుకోవాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలోని నాయకులు దీనికి అడ్డు చెప్పకూడదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేరేందుకు క్యూ కడుతున్నారు. కేసీ వేణుగోపాల్ మీటింగ్ ముగిసిన మరుసటి రోజునే ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బీజేపీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు రాజ్ మహ్మద్, రవీందర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ను వీడి హస్తం గూటికి చేరారు.
మరోవైపు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో గాయకుడు ఏపూరి సోమన్న, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి తదితరులు హస్తం అందుకున్నారు. వీరే కాకుండా ఆయా జిల్లాల నుంచి ఇంకా చాలా మందే క్యూలో ఉన్నారని, వారి వివరాలు బయటకు పొక్కితే ఆయా పార్టీల అధిష్టానం జాగ్రత్త పడుతుందన్న ఉద్దేశంతో సమాచారం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. చేరికల ప్రక్రియ నిరంతరం కొనసాగించాలన్న కేసీ సూచనతో రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చేరికల తాకిడి భారీగా ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
చేరికలు కలిసి వచ్చేనా? మెజార్టీ సీట్లు సాధించేనా?
కాంగ్రెస్లో ఎప్పుడు లేనంత చేరికల జోష్ ఇప్పుడు కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తిగా పార్లమెంటు ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ క్రమంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బలమైన నేతలు కొందరు చేరగా, మరికొంత మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పటికే పార్టీని నమ్ముకొని వచ్చిన దానం నాగేందర్, జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులకు టికెట్లు కేటాయించింది. వీరి చేరికతో పలువురు నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. వీరి ప్రచారానికి, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్ సూచన మేరకు పార్టీ అభ్యర్థులకు సహకరిస్తారా? చేరిన నాయకులు సైతం ఆయా నియోజకవర్గాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం బాగానే ఉన్నా.. వారు కాంగ్రెస్ గెలుపులో ఏ మేరకు పాత్ర వహిస్తారు? అన్నదానిపై విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. ఎవరికి కలిసి వస్తుందో వేచి చూడాలి మరి..!