CM Revanth Reddy: మనబలగం, కరీంనగర్ బ్యూరో: ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ఎంఎల్ఏ లతో కలిసి పాల్గొన్నారు. గతంలో పి.సి.సి చీఫ్ గా పాదయాత్ర సమయంలో వేములవాడ రావడం జరిగిందని, ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేర్ ముంపు బాధితుల సమస్యలు పరిష్కారం, వేములవాడ, సిరిసిల్ల , చొప్పదండి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని చెప్పారు. సిరిసిల్ల ప్యాకేజీ 9 పనులను జిల్లా ఇంఛార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నవంబర్ 30 లోపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుంచి దేశ రాజధాని వరకు నాయకత్వం అందించింది కరీంనగర్ జిల్లా అని పొగిడారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన పివి నర్సింహా రావు అందించింది కరీంనగర్ జిల్లానేనన్నారు. రైతాంగానికి, యువకుల బాధ కలిగితే కరీంనగర్ నుంచే ఉద్యమాలకు మొదలయ్యాయయని చెప్పారు. సిరిసిల్ల, జగిత్యాల రైతాంగం పోరాటాలు ఎవరూ మర్చిపోలేనివని తెలిపారు. 2004లో సోనియా గాంధీ కరీంనగర్ నుంచే తెలంగాణ ఇస్తామని హామి ఇచ్చారన్నారు. పొన్నం ప్రభాకర్, జైపాల్ రెడ్డి వంటి ఎంపీలు వీరోచితంగా పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. కరీంనగర్ జిల్లాకు ఎంపి బండి సంజయ్ ఏం చేశారో ప్రజలు ఆలోచించాలని కోరారు. 10 సంవత్సరాల కాలంలో గత ముఖ్యమంత్రి 20 లక్షల కోట్ల ఖర్చు చేసినా రాజన్న ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులు ఎందుకు పెండింగ్ ఉన్నాయో ఆలోచన చేయాలన్నారు. గత ఎమ్మెల్యే ను కల్వాలంటే ప్రజలు జర్మనీ పోవాలని, నేడు ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేములవాడ వీధులలో తిరుగుతున్నాడని పేర్కొన్నారు.
వేములవాడ ఎమ్మెల్యే కృషి ఫలితంగా అభివృద్ధి పనులు, సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయకుండా నూలు డిపో, వైద్య కళాశాల ఏర్పాటు చేశామన్నారు. గల్ఫ్ కార్మికుల గురించి స్థానిక నాయకుల ఆలోచన మేరకు బోర్డు తో పాటు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత సీఎం పడావు పెట్టిన ప్రాజెక్టుల మళ్ళీ ప్రారంభిస్తున్నామని, గతంలో రైతులకు రుణమాఫీ చేస్తే నేను చేయాల్సిన అవసరం లేదు కదా? అని ప్రశ్నించారు. 11 వేల కోట్ల రుణ మాఫీ 5 సంవత్సరాల చేస్తే, తమ ప్రభుత్వం 25 రోజుల్లో 18 వేల కోట్ల మాఫీ చేసిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన రుణమాఫీ, నేడు జరుగుతున్న రుణమాఫీ పై చర్చ పెడ్తాం, ధైర్యం ఉంటే కేసిఆర్ రావాలని డిమాండ్ చేశారు. వందలాది బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. 10 నెలల పాలనలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని, కోటి 10 లక్షల మంది ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామని ఇందుకు 3700 కోట్ల ఖర్చు పెట్టామని వివరించారు. సన్న వడ్ల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో 66 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసారన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు లిఫ్ట్ చేయకుండా రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు.
రంగనాయక్ సాగర్, కొండ పొచమ్మ సాగర్ పై నిజనిర్ధారణ కమిటీ వేద్దామా అని విపక్షాలకు సవాల్ విసిరారు. కొడంగల్ అభివృద్ధి కోసం నారాయణ పేట కొడంగల్ ప్రాజెక్టు పెడితే అందులో పుల్లలు పెడుతున్నారని విమర్శించారు. పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తుంటే అధికారుల పై దాడి చేస్తే కేసులు పెట్టవద్దా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టవద్దా? భూ సేకరణ చేయవద్దా? 10 ఏళ్ళ గత ప్రభుత్వం భూ సేకరణ చేయలేదా? అని సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ చేయాల్సిందేనని, భూ సేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వలేమన్నారు. సీఎస్ కు ఆదేశాలు జారీ చేసి భూమి విలువ పెంచి రైతులకు అత్యధిక పరిహారం అందేలా చేస్తామని తెలిపారు. పరిశ్రమలు రాకపోతే యువతకు ఉపాధి ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. నా నియోజకవర్గం పై ఎందుకు కక్ష కట్టారు? ఎక్కడికి వెళ్లినా కుట్ర చేసిన కేటిఆర్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా.. తెలంగాణను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.