Group-II Exams
Group-II Exams

Group-II Exams: గ్రూప్-II పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Group-II Exams: నిర్మల్, డిసెంబర్ 10 (మన బలగం): గ్రూప్-II పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రూప్-II పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలో 24 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 8080 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి నియమించిన ఇన్విజిలేటర్ లు, శాఖపరమైన అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు శిక్షణలు అందించాలని సూచించారు. పరీక్ష పత్రాలను తీసుకువెళ్లేందుకు బందోబస్తు ఏర్పాట్లను చేసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలు డిసెంబర్ 15 (ఆదివారం) ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం12.30 వరకు, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు, అలాగే 16న (సోమవారం) ఉదయం 10.00 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాలని, మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువులతో రాకూడదని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి, రక్షణ చర్యలు తీసుకుని ఆ ప్రాంతంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు, త్రాగునీరు, తదితర మౌలిక వసతులు కల్పించాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షలు జరిగే సమయాలలో అభ్యర్థుల సౌకర్యార్థం ఆయా రూట్లలో అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పరీక్షలను సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఆర్డిఓ రత్నాకళ్యాణి, పబ్లిక్ సర్వీస్ రీజినల్ కోఆర్డినేటర్ పీజి రెడ్డి, విద్యాశాఖ అధికారి పి. రామారావు, ఆర్ఐఓ పరశురాం, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ రామ్మోహన్, నిర్మల్ పట్టణ, గ్రామీణ తహసిల్దార్లు రాజు, సంతోష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *