Mahashivratri
Mahashivratri

Mahashivratri: అబ్బో..! అభిషేకమా.. శివరాత్రివేళ దోపిడీ

  • ఆలయాల్లో అందరికీ అందని పూజలు
  • ఆలయాల అభివృద్ధి పేరిట దోపిడీ
  • ఇష్టారాజ్యంగా పూజలకు రుసుములు
  • భక్తులకు దక్కని అభిషేక భాగ్యం
  • చిట్యాల ఆలయం నుంచి వెనుదిరిగిన భక్తులు
  • దేవాదాయ శాఖ స్పందించాలి

Mahashivratri: నిర్మల్, ఫిబ్రవరి 26 (మన బలగం): అభిషేక ప్రియుడికి సామాన్య ప్రజల అభిషేకం దక్కకుండా పోయింది. శివరాత్రి వేళ ఎంతో భక్తితో శివాభిషేకం చేసుకుందామనే భక్తులకు అబ్బో అభిషేకమా.. ఇంత ఖరీదా అనే రీతిలో షాక్ ఇచ్చారు. చిట్యాల ఆలయ అభివృద్ధి కమిటీ. దీంతో సాధారణ భక్తులకు అభిషేకం అందకుండా పోయింది. భక్తితో వెళ్లిన భక్తులకు నిరాశే ఎదురైంది. అభిషేకం చేయకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆలయాల్లో అందుబాటులో లేని రుసుములు
హిందూ దేవాలయాల్లో పూజలు సాధారణ భక్తులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. నిర్మల్ జిల్లాలోని ఆయా ఆలయాలు అభివృద్ధి పేరిట కమిటీలు వేసుకొని పూజలకు రుసుములను నిర్ణయించి సాధారణ భక్తులకు భగవంతుని సేవ అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్నవారు ఎంత రుసుమైనా చెల్లించి పూజలు చేసుకోగలరు. కానీ సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు భగవంతుడి సేవకు దూరం కావాల్సిన పరిస్థితిని ఆలయ కమిటీలు కల్పిస్తున్నాయి. కమిటీలు అభివృద్ధి పేరిట సాధారణ ప్రజలకు భగవంతుడి సేవను దూరం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వివిధ రకాల పూజలకు రుసుములను నిర్ణయించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. రుసుము చెల్లిస్తేనే పూజలు చేసుకునే అవకాశం కల్పిస్తామని పూజారులు నిర్మొహమాటంగా చెబుతున్నారు. దీంతో అంత ఆర్థిక స్థోమత లేని అనేకమంది దేవుణ్ణి పూజించకుండానే దూరం నుంచి దండం పెట్టుకొని వెను తిరగాల్సిన పరిస్థితిని ఆలయ కమిటీలు కల్పిస్తున్నాయి. దీంతో అనేకమంది హిందువులు వివిధ రకాల పూజలకు నిర్ణయించిన రుసుములను చెల్లించుకునే ఆర్థిక స్తోమత లేక నిరుత్సాహంతో వెళ్లిపోతున్నారు.

శివరాత్రి వేళ అందని అభిషేక పూజ
శివరాత్రి పండుగ వచ్చిందంటే శివుడికి అభిషేకం చేసి శివానుగ్రహం పొందాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ శివరాత్రి వేళ ఆలయాలలో అభివృద్ధి కమిటీలు నిర్ణయించిన రుసుములను చెల్లించుకోలేక అనేకమంది శివుడి అభిషేకానికి దూరమయ్యారు. సాధారణ సమయాల్లో అభిషేకాలకు రుసుములను అందుబాటులో ఉండే విధంగా నిర్ణయిస్తే పరవాలేదు. కానీ శివరాత్రి పర్వదినం వేళ అభిషేకానికి భారీగా రుసుములను నిర్ణయించడంతో అనేకమంది పేద మధ్యతరగతి కుటుంబాలు శివాభిషేకానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చిట్యాల వేంకటేశ్వర ఆలయం నుంచి వెనుదిరిగిన భక్తులు
నిర్మల్ జిల్లా చిట్యాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో రుసుముల పట్టికను చూస్తే అబ్బో అనక మానరు. ఆలయ కమిటీ అభివృద్ధి పేరిట నిర్ణయించిన రుసుములు సాధారణ భక్తులకు భగవంతుని సేవించే అవకాశం లేకుండా చేసింది. శివుడి అభిషేకానికి 300 రూపాయల రుసుమును నిర్ణయించడంతో శివరాత్రి వేళ అంత రుసుము చెల్లించుకునే ఆర్థిక స్తోమత లేని అనేకమంది భక్తులు వెనుతిరిగి పోయారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అభిషేక రుసుమును నిర్ణయిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఏకంగా 300 రూపాయలు అభిషేకానికి రుసుముగా పెట్టడంతో ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ పునరాలోచించి రుసుములను తగ్గించాలని భక్తులు కోరుతున్నారు.

దేవాదాయ శాఖ స్పందించాలి
జిల్లాలోని వివిధ ఆలయాల్లో అభివృద్ధి కమిటీలు ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్న రుసుములపై దేవాదాయ శాఖ అధికారులు స్పందించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఆలయాల్లో వివిధ పూజలకు పెంచిన రుసుములతో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు ఆలయాల్లో పూజలు చేసుకునే అవకాశం కోల్పోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా రుసుములను నిర్ణయించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *