Leprosy: నిర్మల్, మార్చి 13 (మన బలగం): కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో కుష్టు వ్యాధి కేసు గుర్తింపు కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే కుష్టు వ్యాధిని గుర్తించి చికిత్స అందించినట్లయితే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చు అని తెలిపారు. అనంతరం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు లెప్రసీ కేసు గుర్తింపు కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుష్టు వ్యాధిని గుర్తించడానికి ప్రతి ఒక్కరిని పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని లెప్రసీ కేసులు గుర్తించి చికిత్సలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా విస్తరణ, మాస్ మీడియా అధికారి బారే రవీందర్, డిప్యూటీ పీఎంవో రాజేశ్వర్, లెప్రా సొసైటీ ఫిజియోథెరపిస్ట్ కిషన్ రావు, జిల్లాలోని ప్రాథమిక వైద్య కేంద్రాల వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షక అధికారులు పాల్గొన్నారు.