CPI: కరీంనగర్, మార్చి 16 (మన బలగం): కరీంనగర్ నగరంలో విచ్చలవిడిగా ఫుట్‌పాత్‌లను వ్యాపారులు ఆక్రమిస్తున్నా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. కరీంనగర్ నగరంలో కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో నగరమంతా సైడ్ ట్రాక్స్ ఫుట్‌పాత్‌లు ప్రజల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే అవి పూర్తిగా దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు. ఆక్రమణలకు గురవుతున్నా వాటిని కాపాడడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. నామమాత్రంగా మున్సిపల్ అధికారులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్పా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారాలు ఇచ్చే ఆమ్యామ్యాలకు మున్సిపల్ అధికారులు అలవాటు పడి వారికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన మున్సిపల్ అధికారులే భక్షకులుగా మారారని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకొని ఎక్కడెక్కడ వాకింగ్ ట్రాక్స్ ఆక్రమణకు గురయ్యాయో గుర్తించి వాటిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటిని ప్రజలకు నడిచేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరంలో మున్సిపల్ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల అక్రమాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు రోడ్లను ఆక్రమించడం ద్వారా వాహనాల పార్కింగ్, నడవడం తీవ్ర ఇబ్బందిగా మారుతోందని తెలిపారు. వీటిపై ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.