Tribal farmers
Tribal farmers

Tribal farmers: సచ్చినా మంచిదే.. సొంతూరికే వెళ్తాం

  • పులి సాకుతో మమ్ముల్ని బలి చేశారు
  • ఏడాదిన్నర గడిచినా పట్టాలు ఇవ్వలేదు
  • మేమెట్లా బతికేది
  • ఎఫ్డీవోతో మైసంపేట, రాంపూర్ గ్రామస్తుల వాగ్వాదం

Tribal farmers: నిర్మల్, జులై 1 (మన బలగం): ‘‘పులి సాకుతో మమ్ములను బలి పశువులను చేశారు. పులి దెబ్బకు సచ్చినా మంచిదే మా సొంతూరికే వెళ్ళిపోతాం. చీకూ చింత లేకుండా ఊర్లకు దూరంగా దశాబ్దాల కాలంగా అడవిలో బతికిన మమ్ములను నాయకులు, అధికారులు అన్యాయానికి గురిచేశారు. మా ఊరిని వదిలి మేము బిచ్చగాళ్లం అయ్యాం. ఇల్లు కట్టిస్తామన్నారు. వ్యవసాయ భూములు సాగుకు అనుకూలంగా సిద్ధం చేసి ఇస్తామన్నారు. అధికారులు ఇప్పుడు పట్టనట్లు ఉంటున్నారు. వారి మాటలు నమ్మి ఊరిని వదిలాము. ఏడాదిన్నర కాలంగా పని లేక, కూలి నాలి చేసుకొని బతకాల్సిన పరిస్థితి కల్పించారు.’’ అని కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైగర్ జోన్ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గ్రామాలను మొదటి విడతలో కడెం మండలం మద్దిపడగ శివారుకు తరలించారు. అక్కడే పక్కా గృహాలు కట్టించారు. వ్యవసాయ భూములు ఇవ్వకపోవడం వల్ల గ్రామస్తులు అధికారులు, నాయకుల పని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి మా ఊరికి వెళ్ళిపోతామని అధికారులను నిలదీస్తున్నారు.

ఏడాదిన్నర కాలంగా పనిలేదు
టైగర్ జోన్ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గ్రామానికి చెందిన గిరిజన రైతు కుటుంబాలకు కడెం మండలం మద్దిపడగ గ్రామ శివారులో పునరావసం కల్పించారు. అక్కడే వ్యవసాయ భూములు సాగుకు యోగ్యంగా సిద్ధం చేసి ఇస్తామని ఏడాదిన్నర గడిచింది. నేటి వరకు సాగు భూములు ఇవ్వకపోవడంతో గిరిజన రైతులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. కూలి పని దొరకక కుటుంబ పోషణ భారం అవుతుదని రైతులు ఆరోపిస్తున్నారు.

మమ్ములను మోసం చేశారు
టైగర్ జోన్ పేరిట మమ్ములను మోసం చేశారు. అడవిలో నుంచి తరలించే సమయంలో అధికారులు చెప్పిన మాటలు నమ్మి మోసపోయాం. తరచుగా అధికారులు పర్యటించడం ఏదో ఓ మాట చెప్పి వెళ్లిపోవడం జరుగుతుంది. తమకు ఇచ్చిన హామీలను ఏ ఒక్క అధికారి పూర్తి చేయడం లేదు. దీంతో ఉపాధి లేక తామెట్ల బతికేది అంటూ అధికారులను, నాయకులను నిలదీస్తున్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం.. : ఎఫ్డీవో
పునరావాస గ్రామానికి తరలించే సమయంలో అధికారులు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఖానాపూర్ ఇన్చార్జి ఎఫ్డీవో రేవంత్ చంద్ర అన్నారు. మంగళవారం మైసంపేట్, రాంపూర్ గ్రామాల గిరిజన రైతులకు మద్దిపడగ శివారులో కేటాయించిన వ్యవసాయ భూమిని, పునరావాస గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పట్ల ఆయా గిరిజన గ్రామాల గిరిజన రైతులు నిలదీశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి త్వరలోనే మీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. మైసంపేట్, రాంపూర్ పాత గ్రామాలకు వెళ్లడం చట్ట వ్యతిరేకం అవుతుందని ఆయన రైతులకు నచ్చ చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని, మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Tribal farmers
Tribal farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *