Nirmal floods damage assessment: నిర్మల్, ఆగస్టు 18 (మన బలగం): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై విభాగాల వారీగా పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పర్యటన నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు, వంతెనలు, పంటలు, నివాసగృహాలు దెబ్బతిన్న ప్రాంతాలను తక్షణం సర్వే చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
రహదారులు, వంతెనలు, దెబ్బతిన్న చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. వైద్య శాఖ అధికారులు ఫీవర్ సర్వే నిర్వహించి అవసరమైన చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజక వర్గాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు పంటల నష్టంపై సమగ్ర వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఆమె ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగించాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, జెడ్పీ సీఈఓ గోవింద్, సిపిఓ జీవరత్నం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యాన వన శాఖ అధికారి రమణ, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి డా. రాజేందర్, ఇంజనీరింగ్, మున్సిపల్, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
