- ప్రశాంతంగా ముగిసిన గంగ నీళ్ల జాతర
- జిల్లా ఎస్పీ జానకి షర్మిల
Adelli Pochamma Gang Neella Jatara Concludes Peacefully – Nirmal SP Janaki Sharmila: అడెల్లి పోచమ్మ గంగ నీళ్ల జాతర ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మహాలయ అమావాస్య తదుపరి వచ్చే శని, ఆదివారాల్లో ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 27న అడెల్లి గ్రామంలోని సేవాదారుల ఇంటి నుంచి అమ్మవారి ఆభరణాలు, వెండి కడవతో గోదావరికి పాదయాత్రగా పయనమవడంతో జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వేలాది మంది భక్తులు అమ్మవారి ఆభరణాలను అనుకరిస్తూ అడెల్లి, సారంగాపూర్, యాకర్పల్లి, వంజర్, ప్యారమూర్ మీదుగా దిలావర్పూర్ మండలంలోని కదిలి, మాటేగాం, దిలావర్పూర్, బన్సపెల్లి, కంజర్, సాంగ్వి నుంచి సాయంత్రం గోదావరి తీరానికి చేరుకుంటారు. అక్కడే రాత్రి జాగరణ చేసిన తిరిగి ఆదివారం వేకువజామున ఆభరణాలను పవిత్ర గోదావరిలో నీటితో శుద్ది చేస్తారు. తిరిగి ఆయా గ్రామాల మీదుగా రాత్రికి అడెల్లి ఆలయానికి చేరుకొని ప్రత్యేక వెండి కడవలో తీసుకొచ్చి గోదావరి నీటిని స్థానిక కోనేటి నీటితో కలిపి అమ్మవారికి జలాభిషేకం చేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. ప్రతీ ఏటా జరిగే ఈ జాతరకు నిర్మల్ జిల్లా ప్రాంతవాసులే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. గంగనీళ్ల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తును సైతం ఏర్పాటు చేసారు.
వైభవంగా గంగ నీళ్ల జాతర
సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో గల శ్రీ మహా పోచమ్మ అమ్మవారి గంగనీళ్ల జాతర వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారి ఆభరణాలను యాకర్పల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల దర్శించుకుని, సాంప్రదాయ ప్రకారం స్వయంగా ఎత్తుకునీ కొంత దూరం నడిచారు. అమ్మవారు సారంగాపూర్ గ్రామంలో ప్రవేశించేముందు జిల్లా ఎస్పీ ఆభరణాలు ఎత్తుకోవడం సంప్రదాయంగా వస్తుంది. జాతర సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన గంగనీళ్ల జాతర ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు.