BRS Khanapur Incharge Bukya Johnson Naik Slams Congress Government: ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్ట్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాంలో అబద్ధాల కాంగ్రెస్ పాలన నడుస్తోందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పక్కా ప్రణాళికతో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఘన విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరముంది, స్థానిక సంస్థల ఎన్నికలను నాయకులు, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని, రాత్రిబవంళ్లు కష్టపడి పనిచేస్తేనే మన లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడిగే పరిస్థితి లేదని మనమంతా ధైర్యంగా ముందుకెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవల్సిన అవసరం ఉందని తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పుచేశామని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. సమావేశంలో మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
