- ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన
- ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు
BRS protest: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, బీసీ కోటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని, జీవో9 పై రాష్ట్ర హైకోర్టు స్టే, స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదల చెల్లని జీవోతో చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసి 42 శాతం రిజర్వేషన్‌పై కాంగ్రెస్ సర్కార్ ఒక పథకం ప్రకారం చేసారని, అభ్యంతరాలను పట్టించుకోకుండా 22 నెలలుగా డ్రామాలు చేస్తూ, రాజకీయ లబ్ధిపైనే దృష్టి పెట్టారని డెడికేటెడ్ కమిషన్, ఆర్డినెన్స్, జీవో అన్నింటా హైడ్రామా చేసారని ఆరోపించారు. తెలంగాణ బీసీ బిడ్డలను రేవంత్ సర్కారు మళ్లీ మోసం చేసిందని, ఆశలు పెట్టుకున్న రిజర్వేషన్‌పై విషపు నవ్వులతో వికృత రాజకీయమాడిందని, బీహార్ ఎన్నికల కోసం నాటకం మొదలు పెట్టి, మధ్యలోనే తెరదించిందని మండిపడ్డారు.
బీసీ కోటాను చూపించి బీహార్‌లో ఓట్లను కొల్లగొట్టాలన్న ప్లాన్ అని, రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా సుప్రీంకోర్టు పరిమితి ఉన్నదని తెలిసి, అనేక రాష్ర్టాలు చేతులు కాల్చుకున్నాయనే విషయం ప్రభుత్వానికి తెలిసీ ఇలా చేసిందని, కేంద్రం వద్ద బిల్లు క్లియర్ కాదనీ తెలుసు, సుప్రీం తన తీర్పుకు తానే వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోదని తెలిసినప్పటికీ 42 శాతం బీసీ బిల్లు పేరుతో రేవంత్ సర్కార్ అనేక డ్రామాలాడిందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ సవరణ లేకుండా అసెంబ్లీ తీర్మానంతో కోటా రాదని, విపక్షాలు, బీసీ విద్యావంతులు మొత్తుకుంటున్నా వినకుండా ఎన్నికల నోటిఫికేషన్ దాకా తెచ్చి చివరకు కోర్టు ముందు చేతులెత్తేసిందని, చెల్లని జీవో తెచ్చి, అబాసుపాలయిందని, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని ఎన్నికల్లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నాయకులు సక్కారం, రాజాగంగన్న, శ్రీనివాస్, గౌరీకర్ రాజు, గజేంధర్, ప్రదీప్, కారింగుల సుమన్, రాజేశ్వర్, సుమిత్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
