Southwest Monsoon: మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ర్టాల్లో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెమాల్ తుపాను కారణంగా ఈశాన్య రాష్ర్టాలు కకావికలమయ్యాయి. మరోవైపు ఉత్తరాది రాష్ర్టాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈ రోజు గురువారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు ప్రకటించాయి. అనుకున్న సమయానికి ముందే నైరుతి ఆగమనంతో ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులుపడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనున్నది. కేరళను నైరుతి రుతుపవనాలు తాకిన నాలుగు రోజుల్లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నైరుతి రాకతో సెగలు కక్కుతున్న రాష్ర్టాలు చల్లబడనున్నాయి. నైరుతి రుతుపన కాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గతేడాది రుతుపవనాలు అంచనా వేసిన సమయానికన్నా ఆలస్యంగా వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ముందస్తుగా పలకరిస్తుండడంతో వేడి నుంచి ఉపశమనం లభించనున్నది. ఉపరితల ద్రోణి, అల్పపీడనం కారణంగా వారం రోజులుగా పలు చోట్ల చిరు జల్లులు, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ముందస్తుగానే రుతుపవనాలు తీరాన్ని తాకి వర్షాలు కురిస్తే రైతులు వ్యవసాయ పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.