Modi takes oath as PM: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. చివరి విడుత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. దీంతో ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నదనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే అటూ ఇండియా కూటమి.. ఇటు ఎన్డీఏ ఎవరికి వారు తామే అధికారం చేపట్టబోతున్నట్లు ఢంకా బజాయించి చెప్పుకుంటున్నాయి. ఎలాగైనా గెలుపు తమదేనని భావిస్తున్న బీజేపీ ఏకంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతోంది. మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 9వ తేదీన ముహూర్తం సైతం ఖరారు చేశారు. మోడీ ప్రమాణం చేసేందుకు అనువైన వేదికను సైతం సిద్ధం చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా తొలిసారి 2014 మే 26వ తేదీన, రెండో సారి 2019 మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ రెండు పర్యాయాలు ఎన్నిలక ఫలితాలు మే 23వ తేదీనే విడుదల కావడం యాధృచ్ఛికమే. ఈ సారి మాత్రం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన 4వ తేదీన వెల్లడి కానున్నాయి. రిజల్ట్స్ తరువాత జూన్ 9వ తేదీ శుభ మహూర్తంగా బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ తేదీనే ఖరారు చేసే అవకాశముంది.
కర్తవ్యపథ్‌లో ప్రమాణం
పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ నుంచి ప్రధాని, కేంద్ర మంత్రులు రాష్ర్టపతి భవన్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. నరేంద్ర మోడీ సైతం రెండు మార్లు 2014, 2019లో రాష్ర్టపతి భవన్‌లోనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడోసారి గెలిస్తే కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా నిర్వహించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పక్షం రోజులుగా పార్టీ శ్రేణులు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఫలితాల అనంతరం మంచి మహూర్తం ఖరారు చేయడంతోపాటు వేదికను ఎంపికచేసే పనిలో పడ్డారు. ఈ సారి రాష్ర్టపతి భవన్లో ప్రోగ్రామ్ నిర్వహించడంలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశారు. రాష్ర్టపతి భవన్లో నిర్వహించే ప్రోగ్రామ్‌కు అతిథులను కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించే వీలుంటుంది. ఎక్కువ మందిని ఆహ్వానించేందుకు అవకాశం లేదు. ఈ సారి హ్యాట్రిక్ సాధిస్తామని గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని నిశ్చయించింది. ఈ నేపథ్యంలో వేదికను రాష్ర్టపతి భవన్ నుంచి ఇతర చోటుకు మార్చాలని నిశ్చయించారు. రాష్ర్టపతి భవన్ ప్రమాణ స్వీకార వేడుకకు సరిపోదని భావిస్తున్న బీజేపీ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. కర్తవ్యపథ్ (రాజ్ పథ్)లో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అశేష జనవాహిని మధ్య దేశ సైనిక పాటవాన్ని ప్రదర్శించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచే కర్తవ్యపథ్‌ను ప్రమాణ స్వీకార వేదికగా నిశ్చయించినట్లు పార్టీ శ్రేణుల సమాచారం. హ్యాట్రిక్ విజయాన్ని ఘనంగా చాటి చెప్పాలన్న ఉత్సాహంతో కమలనాథులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
కర్తవ్యపథ్‌లోనే ఎందుకంటే
బ్రిటీష్ పాలన నుంచి రాజ్‌పథ్‌గా ఉన్న మార్గాన్ని మోడీ ప్రభుత్వం కర్తవ్యపథ్గా పేరు మార్చింది. 70 ఏళ్ల క్రితం నిర్మించిన పాత సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను తొలగించి రూ.25 వేల కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మిస్తోంది. కర్తవ్యపథ్ సైతం ఇందులో భాగంగానే ఉంది. రాష్ర్టపతి భవన్ నుంచి ఇండియా గేటు వరకు ఉన్న మార్గాన్నే రాజ్‌పథ్‌గా పిలిచేవారు. ఇప్పుడు దీన్ని కర్తవ్యపథ్గా మార్చారు. బ్రిటీష్ ఏలుబడిలో నిర్మించిన రాష్ర్టపతి భవన్, దానికి కుడి, ఎడమ దిక్కుల్లో సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ భవనాలు ఉన్నాయి. దీంతోపాటు ఆ పక్కనే సర్కిల్ ఆకారంలో నిర్మించిన పాత పార్లమెంటు భవనం ఉంది. సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకి వచ్చింది. సెంట్రల్ సెక్రటేరియట్ భవంతుల్లో కొన్ని నిర్మాణం పూర్తయ్యాయి. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నా్యి. ప్రస్తుతం ప్రమాణ స్వీకారానికి కర్తవ్యపథ్‌ను వేదికగా చేస్తే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులన్నీ ప్రజల దృష్టిలో పడతాయని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో నిమగ్నం కావడం, వేదిక ఖరారు చేసుకోవడం పొలిటికల్‌గా ట్రెండింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.