Bandy Sanjay: ఉద్యమ ఆకాంక్షల అమలుకు మరో పోరుకు సిద్ధం

జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్

Bandy Sanjay: ఉద్యమ ఆకాంక్షల అమలుకు మరో పోరుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకల వేళ రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమించిన కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ అభినందనలు చెప్పారు. లాఠీదెబ్బలు, కేసులు, అరెస్టులు, జైళ్లకు వెరవకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ లోపల, బయట తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్ర అత్యంత కీలక పాత్ర పోషించిందని, నాటి అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తూ తీర్మానం చేసిందన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కొందరు ఎంపీలు పెప్పర్ స్ప్రే చల్లి గొడవకు దిగితే, వాటిని సహిస్తూ నిలబడి బిల్లును ఆమోదించిన మహానేత సుష్మస్వరాజ్ ను ఈరోజు మనమంతా స్మరించుకోవాలన్నారు.

తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లయినా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం అమలు కానేలేదని సంజయ్ విమర్శించారు. గతంలో తెలంగాణకు దక్కాల్సిన నీళ్లను పరాయి పాలకులు పక్క రాష్ట్రానికి దోచిపెడితే, స్వరాష్ట్రం సిద్దించాక తెలంగాణ పాలకులే స్వార్ధ ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రానికి నీటిని తాకట్టు పెట్టారన్నారు. ధనిక రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులకుప్పగా మార్చారన్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు పేరుతో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అవినీతి, నియంత, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలకులను గద్దె దించి పదేళ్ల పాలన పీడ విరగడైందని సంతోషిద్దామంటే, అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని ఆరోపించారు. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే 6 గ్యారంటీలు సహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందన్నారు. కాళేశ్వరంఅవకతవకలు, ఫోన్ ట్యాపింగ్, వడ్ల టెండర్లు సహా కన్పించిన ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుందని సంజయ్ ఆరోపించారు.

తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మారుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందన్నారు. అయినా ఇవేవీ పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్ మాదిరిగానే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ‘తెలంగాణ పదేండ్ల పండుగ’ పేరుతో ప్రకటనలిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ విచిత్ర పోకడలను అనుసరిస్తున్నరని విమర్శించారు. అందుకే ప్రజల పక్షాన, అమరుల ఆశయాల కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం భారతీయ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదల పక్షాన బీజేపీ అలుపెరగని పోరాటాలకు సన్నద్దమైందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *