- శివనామస్మరణతో మార్మోగిన శ్రీ పశుపతినాథ్ ఆలయం
- కన్నుల పండువగా శివపార్వతుల కళ్యాణమహోత్సవం
- వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
Mahashivarati: ముధోల్, ఫిబ్రవరి 26 (మన బలగం): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన ముధోల్‌లోని శ్రీ పశుపతినాథ్ ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో బుధవారం మార్మోగింది. వేకువజామున ఆలయ మహారాజ్ ప్రణీత్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణాల మధ్య శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం బిల్వార్చన చేశారు. శివలింగానికి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివ చ్చి మొక్కులను తీర్చుకున్నారు. అదే విధంగా స్థానిక జటా శంకరాలయం, మండలంలోని ఆయా గ్రామాల్లో హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలను చేశారు. దీంతో భక్తులు బుధవారం ఉపవాస దీక్షలను చేపట్టి రాత్రి జాగరణ చేసి గురువారం ఉపవాసలను విరమించనున్నారు. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నారాయణరావు పటేల్ శ్రీ పశుపతినాథ్ ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలను చేసి హారతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలను చెల్లించుకున్నారు. అనంతరం అఖండ హరినామ సప్తాహం కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో విడిసి ఆధ్వర్యంలో నారాయణరావు పటేల్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు వీడీసీ అధ్య క్షులు విట్ఠల్, కోశాధికారి జిందంవార్ వెంకటేష్ తెలిపారు.
కన్నుల పండుగ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
మండల కేంద్రమైన శ్రీ పశుపతినాథ్ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.ముధోల్ గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
